తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటన సాగుతోంది. దాదాపు రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల కోసం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కదుర్చుకున్న విషయం విధితమే. దానికి కొనసాగింపుగా మరిన్ని పెట్టుబడులను ఆకర్శించడానికి మంత్రి శ్రీధర్ బాబు సౌదీ అరేబియా దేశంలో పర్యటిస్తున్నారు. జెడ్డాలో ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
10 గంటల నుంచి 11 గంటల వరకు జెడ్డా ఛాంబర్స్ తో భేటీ జరుగుతుంది. అనంతరం ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి ఒంటిగంట వరకు సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో భేటీ అవుతారు. ఆ తర్వాత పట్రోమిన్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఆ సంస్థ ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులుపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బట్టర్జీ హోల్డింగ్ కంపోనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతో సమావేశమవుతారు. అరాంకో సంస్థ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు షెరటన్ హోటల్ లో జరిగే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.