దావోస్ లో సీఎం రేవంత్ జోరు.. ఒక్కరోజులోనే తెలంగాణకు రూ.37,870 కోట్ల పెట్టుబడులు

-

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీమ్ దావోస్లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో రేవంత్ టీమ్ జోరు సాగిస్తోంది. కేవలం బుధవారం ఒక్క రోజే రాష్ట్రానికి రూ.37,870 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ, గోద్రెజ్‌, జేఎస్‌డబ్ల్యూ, గోడి, వెబ్‌ వెర్క్స్‌, ఆరాజెన్‌ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి.

దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందంతో సమావేశమైన ఈ సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందా(ఎంవోయూ)లు కుదుర్చుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా.. భారత్‌లో ప్రముఖ ప్రైవేట్‌ రంగ విద్యుత్తు సంస్థగా పేరున్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ.. తన అనుబంధ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ నియో ద్వారా రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు గోది ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ తెలంగాణలో ‘గిగా స్కేల్‌ బ్యాటరీ సెల్‌’ తయారీ కేంద్రం నెలకొల్పేందుకు రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.

ఐరన్‌ మౌంటేన్‌ అనుబంధ సంస్థ వెబ్‌ వెర్క్స్‌ తెలంగాణలో రూ.5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి, సేవలను విస్తరించేందుకు ‘ఆరాజెన్‌ లైఫ్‌సైన్సెస్‌’ రూ.2 వేల కోట్ల కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. మరోవైపు గోద్రెజ్‌ సంస్థ రూ.1,000 కోట్ల కెమికల్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version