ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిసెంబర్ 28 నుంచి గ్రామాలు, పట్టణాలు మున్సిపల్ వార్డుల్లో 5 పథకాలు అనగా మహాలక్ష్మీ, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తాం. ఎనిమిది పని దినాలలో గ్రామసభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జనవరి 07 లోపు లబ్దిదారుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అర్హులు అయిన వారందరూ పథకాలు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రతీ మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు. ప్రతీ అధికారి రోజు రెండు గ్రామాలను సందర్శిస్తారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గడీల మధ్య జరిగిన పాలనను గ్రామాలకు తీసుకువస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.