గత పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవితకు వెన్నుపోటు పొడిచింది సొంత పార్టీ ఎమ్మెల్యేలేనని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత గెలిస్తే ఆధిపత్యం చెలాయిస్తుందేమోనన్న భయంతో ఆమెను ఓడించారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే.. లోక్సభ ఎన్నికలలో మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. రైతులతో నామినేషన్ కాంగ్రెస్ పార్టీ వేయిస్తే.. బిజెపిలోకి ఎందుకు వెళుతున్నారని నిలదీశారు. కవితను నిజామాబాద్ లో కనబడకుండా చేస్తే ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చని భావనతోనే ఆమె అనుచరులు, ఎమ్మెల్యేలు కలిసి ఓడించారని ఆరోపించారు. ఇక కవిత ఓడిపోవాలని, కాంగ్రెస్ పార్టీ గెలవాలనే తమకు ఉంటుందని చెప్పుకొచ్చారు జీవన్ రెడ్డి.