ఆగస్టు 31వ తేదీన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనురు మండలంలో ఆదివాసి యువతీపై షేక్ ముగ్ధూమ్ అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనని నిరసిస్తూ జైనుర్ పట్టణంలో ఆదివాసీలు బంద్ కి పిలుపునివ్వడం, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడులు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ఈ ఘటనలో దుకాణాలు తగలబెట్టారు. దీంతో ఇరు వర్గాలను నిలిపివేసిన పోలీసులు జైనూర్ లో 144 సెక్షన్ విధించారు. నిందితుని వర్గానికి చెందిన వారిని ఏజెన్నీ ప్రాంతం నుంచి మైదానపు ప్రాంతానికి తరలించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిందితుడిని ఉరితీసి బాధితురాలికి న్యాయం చేయాలని ఆదివాసీల డిమాండ్. ఇక ప్రస్తుతం బాధితురాలికి హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటన మతవిద్వేషాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన మంత్రి సీతక్క.. మహిళపై జరిగిన లైంగిక దాడి ఘటనకు కొందరు మతం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వారు ఏ వర్గం వారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మత చిచ్చుపెట్టే వారి పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీతక్క.