హైదరాబాద్‌లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్యాప్ ఇస్తూ మరి కురుస్తున్న వానలకు నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రోజున ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. ఏకధాటి వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. నిరంతరాయంగా కురిసిన వానకు నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రజలు బయటకు రాకుండా భారీ వర్షం కురవడంతో వీకెండ్ రోజు నగరవాసులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇవాళ్టి నుంచి ఓ మూడ్రోజులు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ గురువారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నగర ప్రజలకు ఓ హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే..?
కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ మ్యాన్‌హోళ్లను తెరుస్తున్న విషయం తెలిసిందే. తద్వారా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల నాలాల్లో పడి ఓ బాలుడి ప్రాణాలు ఇలాగే పోయాయి. ఈ నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. మ్యాన్‌హోళ్లు తెరిచిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది. ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూత తెరిచినా, తొలగించినా జలమండలి చట్టం సెక్షన్ 74 ప్రకారం నేరం. నిందితులకు జరిమానాతోపాటు కొన్నిసార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముందని జలమండలి స్పష్టం చేసింది.