కామారెడ్డి ఘటనపై స్పందించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

-

కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించడం బాధాకరమని అన్నారు. కామారెడ్డి జిల్లా హసన్ పల్లి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందడం మరో 14 మంది గాయపడడం చాలా బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదానికి గురైన వారు పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు అని తెలిసి తీవ్ర ఆవేదన కలిగిందన్నారు. కుటుంబ సభ్యుడు మరణించగా దశదినకర్మ లో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణంలోని సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం మాటలకందని విషాదం గా ఉందన్నారు.

ప్రమాదానికి గురైన కుటుంబం వారు ప్రయాణించిన వాహనాన్ని డ్రైవర్ అతివేగంగా నడపడమే కారణమని ప్రాథమిక సమాచారం వల్ల తెలుస్తోందన్నారు పవన్. గ్రామీణ రహదారులపై ప్రయాణిస్తున్న వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి రవాణాశాఖ అధికారులు కఠినమైన చర్యలు చేపట్టాలన్నారు జనసేనాని. మృతుల కుటుంబాలను, గాయపడినవారిని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా, వైద్య పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను అన్నారు పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news