తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై జరుగుతున్న విచారణ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తప్పుకున్నారు. విచారణ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన లేఖ రాశారు. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ నివేదిక పూర్తయిందని, గత శనివారమే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని అనుకున్నానని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అన్నారు.
అయితే కేసీఆర్ దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారని, అది సోమవారం విచారణకు రానుందని గురువారం సాయంత్రం తెలిసి తన ప్రయత్నం విరమించుకున్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు వెలువడకముందే నివేదిక సమర్పించినా తప్పేమీ కాదని, కానీ తాను స్వీయ క్రమశిక్షణ పాటించి ఇవ్వలేదని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి, నరసింహారెడ్డి, కొత్త ప్రభుత్వం కలిసి కక్షసాధిస్తున్నట్లు కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టులో చేసిన వాదనలను ఆయన తోసిపుచ్చుతూ.. తాను ఇంతవరకు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం కాదు కదా, కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు.