మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన విచారణ తదుపరి దశ ఇవాళ్టి నుంచి షురూ కానుంది. విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదుల శాఖ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, పదవీ విరమణ చేసిన వారు, ఇతరులను విచారించిన విషయం తెలిసిందే. వారి నుంచి పలు విషయాలు ఆరా తీసి ఇప్పటి వరకు 57 మంది అఫిడవిట్లు సేకరించింది.
ఇక విచారణలో భాగంగా వారందరు దాఖలు చేసిన అఫిడవిట్లను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇవాళ్టి నుంచి బీఆర్కే భవన్లో బహిరంగ విచారణ జరపనుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. విచారణకు వచ్చే వారు న్యాయవాదులను కూడా వెంట తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇవాళ్టి విచారణలో నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్గా పని చేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరు కానున్నారు.