రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. అయితే తన తండ్రి కేకే ఈ వయసులో బీఆర్ఎస్ను వీడడం బాధగా ఉందని, మరోసారి ఆలోచించి కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన కుమారుడు కె.విప్లవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏవో పదవుల కోసం కేకే కాంగ్రెస్‌కు వెళ్తున్నారని తాను అనుకోవడం లేదని విప్లవ్ పేర్కొన్నారు. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ పార్టీని వీడనని చెప్పారు. తన తండ్రిపై తాను చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందనే వాదన అర్థరహితం అని విప్లవ్ కుమార్ తెలిపారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరానని కె.కేశవరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ఆ లక్ష్యం నెరవేరడంతో.. 85 ఏళ్ల వయసులో ఇక తిరిగి సొంత గూటికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు ఇంకా రెండేళ్ల సమయముందని, అవసరమైతే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని వెల్లడించారు.