నిండు కుండలా కడెం జలాశయం.. 2 గేట్లు తెరిచి నీటి విడుదల

-

గత మూడ్రోజులు కురిసిన వర్షాలకు తెలంగాణ చిగురటాకులా వణికిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు రాష్ట్రం అస్తవ్యస్తమయింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కాలనీలు నీటమునిగాయి. ఇక ప్రాజెక్టుల్లోకి భారీ వరద పోటెత్తింది. ఇంకా ఈ వరద కొనసాగుతూనే ఉంది. తాజాగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు భారీ వరద ప్రవాహంతో నిండుకుండలా మారింది. ఇంకా వరద పోటెత్తుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

కడెం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తిన అధికారులు.. దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులకు చేరింది. జలాశయంలోకి 21,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 17,745 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది.

మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 16 గేట్ల ద్వారా 49,960 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 5000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news