రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వర్షాలతో రాష్ట్రంలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని చోట్ల వాగులు పొంగిపొర్లి రహదారుల పైకి నీళ్లు చేరాయి.
మరోవైపు నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం అవుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇక కడెం జలాశయానికి భారీ ఎత్తున వరద రావడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి నీరు చేరింది. ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరుతోంది. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం ఔట్ ఫ్లో 2.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 4 గేట్లు మొరాయించడంతో ఓవైపు అధికారులు.. మరోవైపు ప్రజలు భయాందోళన చెందారు. అయితే తాజాగా మరో రెండు గేట్లు తెరుచుకోవడంతో కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.