తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గత సీఎంను, ప్రస్తుత ముఖ్యమంత్రిని ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఒకే ఒక్కడు సినిమాను ప్రేరణగా తీసుకున్న ఆయన నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను ఆయన ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని, ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు బాక్స్‌ల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు.
“నేను నా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకే శాసనసభలో అడుగుపెట్టాను. నాకు ఓటేసిన ప్రజల నమ్మకాన్ని ఎన్నటికీ మరవను. అందుకే ప్రజల సమస్య కోసం ఓ ఆలోచన చేశాను. అందరూ నా వద్దకు వచ్చి వారి సమస్యలు చెప్పుకునే వీలుండదు. అలాగని నేనూ అందరి వద్దకు వెళ్లలేను. అందుకే ఓ మాధ్యమంగా ఈ ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశాను. వీటిద్వారా నేను ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రయత్నిస్తాను.” అని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తెలిపారు.