మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమయం కోరడంతో న్యాయస్థానం ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 6వ తేదీన కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దిల్లీ మద్యం కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్టు చేయగా… ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో తిహాడ్ జైలులో ఉన్నారు.
మరోవైపు ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని దిల్లీలోని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం మరో వారం రోజులు పొడిగించింది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ఈనెల 7వ తేదీన ముగియటంతో, కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం, కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకు పొడిగించింది.