రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరుతో మహారాష్ట్రలో తిరుగుతున్నారని మండిపడ్డారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇతర ముఖ్య నేతలు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు, సామాన్య ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దొరల పాలనలో రైతులకు మిగిలింది ఏమీలేదని.. దొరల రాజ్యం పోయి రైతుల రాజ్యం రావాలన్నారు. సీఎం కేసీఆర్ రైతు హంతకుడని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సంరక్షణపై ఆయనకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇక ప్రకృతి విపత్తు పై పార్లమెంటులో చర్చకు పట్టుబడతామని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించారని అన్నారు.