తెలంగాణలో పెన్షన్ కోసం చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని ఆర్థిక మంత్రి హారీష్ రావు ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా పట్టణ ప్రగతి కార్యక్రమం పై సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ఎం.సీ.ఆర్ హెచ్. ఆర్. డి. లో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ ఛైర్మన్లు ,మున్సిపల్ కమిషనర్ల తో ఈ సమావేశం జరుపుకుంటున్నామని.. వచ్చె నెల 3వ తేదీ నుండి పట్టణ ప్రగతి ప్రారంభం అవుతుంది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
పల్లె ప్రగతి తో రాష్ట్రంలోని గ్రామాలు చక్కటి రూపును సంతరించుకున్నాయి. అదే స్థాయిలో మన మున్సిపాలిటీలు మాత్రం బాగుపడ లేదన్నారు. ఈ దఫా పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల రూపు మారాలని తెలిపారు. మున్సిపాలిటీల్లో వైకంఠధామాలు, వెజ్ – నా న్ వెజ్ మార్కెట్ పనులు వేగవంతం చేయాలి. మొక్కల ను పెద్ద ఎత్తున పెంచాలన్నారు. వాటి సంరక్షణ బాధ్యత మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులదే. గ్రామాల్లో చక్కగా మొక్కల పెంపకం ,సంరక్షణ జరుగుతోందని వెల్లడించారు.