తెలంగాణ వాకిట మరో గొప్ప సందర్భం ఇది. ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా మాట్లాడుకున్నా ఆ అమ్మాయి గొప్పతనం దగ్గర చాలా మంది అంటే చాలా మంది ఇప్పుడిక చిన్నవారే ! కొన్ని ఆంక్షలుంటేనే బాగుంటుంది. దాటి రావడం తెలుస్తుంది. కొన్ని నియమాలు ఉంటేనే తెలుస్తుంది. కఠినత్వం విలువ ఎంతన్నది. ఆ విధంగా నిఖత్ మంచి అమ్మాయి. అన్నింటినీ అర్థం చేసుకుని ఈ స్థాయికి వచ్చారు. వారికి మన లోకం డిజిటల్ మీడియా తరఫున శుభాకాంక్షలు. విశ్వ విజేతకు జేజేలు. నిజామాబాద్ ఆడబిడ్డలందరికీ జేజేలు. ఆ మాటకు వస్తే తల్లులందరికీ జేజేలు.. తప్పక పలకాలి. పాదాభివందనం చేయాలి. ఎందుకంటే మంచి బిడ్డల ఎదుగుదలకు మంచి పెంపకం, స్ఫూర్తిదాయక ప్రయాణం అన్నవి ఎంతో కీలకం. ఆ విధంగా నా తెలంగాణ వాకిట బిడ్డల ఉన్నతికి కారణం అయిన తల్లులకు జేజేలు పలకాలి ఈ ఉదయం.
విభాగం : 52 కేజీలు
ప్రత్యర్థి : థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ జటామస్
గెలుపు : 5-0 తేడాతో
ఇప్పుడంతా ఆమెను మేరీకోమ్ అంటున్నారు. కానీ ఓ సందర్భంలో మేరీ కోమ్ నే ఎదిరించిన అమ్మాయి నిఖత్ అని తెలిస్తే ఏమయిపోతారో ! కనుక కాలం గొప్పది. మనం వీరుల సృష్టిని విజేతల రాకను చూస్తూ ఆనందించాలి. విజేతలకు పలికే స్వాగతం ఓ గొప్ప సందర్భం అయి ఉంటుంది. తెలంగాణ వాకిట సీఎం కేసీఆర్ ఎంతో ఆనందిస్తున్నారు. నిఖత్ ఆ ఊరి ఎమ్మెల్యే ఓ లక్ష రూపాయలు (వ్యక్తిగత సాయం అని రాయాలి) అందిస్తానని చెప్పారు. ఇంకొందరు ఆడబిడ్డలు ఈ విధంగా బాక్సింగ్ లో రాణిస్తే పదే పదే మేరీకోమ్ పేరే కాదు నిఖత్ పేరు కూడా మరో సారి ఇంకోసారి గుర్తుకు వస్తుంది. విజేతలు ఎక్కడి నుంచో వస్తారా ? ఈ ప్రశ్న దగ్గర నుంచి ఆలోచిస్తే లేదండి.. నగరాలూ, పట్టణాలూ విజేతలను అందించవు.. అవి కేవలం సాయం చేస్తాయి. ఎదుగుదలకు సాయం చేస్తాయి. ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలకు ఇవన్నీ తెలుసు.
అందులో తెలంగాణ లాంటి చైతన్యం ఉన్న నేల బిడ్డలకు ఇవన్నీ తెలుసు. అందుకనో ఎందుకనో మనం ఇవాళ మన పాఠ్యాంశాలలో మరో సారి, ఉదయపు పాఠాలలో, స్మరణల్లో మరోసారి నిఖత్ తలుచుకుంటే చాలు. మరికొందరు ఆకతాయిల కట్టడికి ఏ దిశ (యాప్) అక్కర్లేదుజ. యాప్ మాత్రమే యాక్ట్ కాదు. గుర్తు పెట్టుకోవాలి మీరు. ఏ మహిళా పోలీసూ అక్కర్లేదు.
విశ్వాసం నింపిన లేదా నిండిన విజయాలు ఇవాళ తెలంగాణ వాకిట గొప్ప సుప్రభాత స్వరాలకు సంకేతం అయి ఉండాలి. ఉంటాయి కూడా ! ప్రేమ విశ్వాసం నిండిన అమ్మాయిలు కొత్త తరం అమ్మాయిలు ఈ దేశానికి అవసరం. నా తెలంగాణకూ నా ఆంధ్రా నేలకూ అవసరం. ప్రేమ అంటే గెలుపునకు ఓ నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ఆ విధంగా నిఖత్ పంచే ప్రేమ
ఓ విశ్వ వెలుగు కావాలి. బుజ్జి తల్లీ మీకు జేజేలు. ఎందుకంటే చాలా మందికి చేతగానివి మీ వల్ల సాధ్యం అయిన ఒకే ఒక్క కారణంతో.. ! పలికిన లేదా పలకాల్సిన జేజేలు. అమ్మాయిలు అంటే బ్యూటీ పార్లర్ కు పోయే వాళ్లు..లేదా అందానికి కేరాఫ్ లు, డాటరాఫ్ లు ఇలాంటి గ్లోరిఫై సెన్సు వద్దండి.. మన బిడ్డలను బిడ్డలుగానే చూసి ఆనందిస్తే చాలు. వాళ్లకు కొన్ని విలువలు మరియు ఆత్మవిశ్వాసం అన్నవి ఏ బ్యూటీ పార్లర్లూ అందించవు. అందం కన్నా ఆత్మవిశ్వాసం గొప్పది కదా! కనుక హైద్రాబాదీలూ జర ఆలోచించుండ్రి ! ఇగో విజయవాడ, విశాఖ అమ్మాయిలూ మీరు కూడా ! ఔ మల్ల ! ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏమన్నారు ఆ విజేత గురించి ఏం చెప్పారో చదవండిక
ప్రతిష్టాత్మక ‘ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలిచిన వైనంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని, తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని తెలిపారు.
– రత్నకిశోర్ శంభుమహంతి