కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేదు ఫలితాలను చూసింది. గతంలో ఎన్నడూ లేనంతగా చాలా తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం ఓటమికి గల కారణాలను ఈ పార్టీ విశ్లేషించుకుంటోంది. అలాగే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించారు.

 

ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో  కేసీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిద్దామని వారితో చెప్పినట్లు సమాచారం. అలాగే కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కొత్త సర్కార్ ఎలాంటి మార్పు తీసుకువస్తుందో.. ఆ ప్రభుత్వం విధివిధానాలేంటో.. అసలు ఏమి జరుగుతుందో వేచి చూద్దామని ఎమ్మెల్యేలతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి.. శాసనసభాపక్ష నేతను త్వరలో ఎన్నుకుందామని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news