తెలంగాణ సాధించుకుని 10వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఊ ఉత్సవాలపై తుదిరూపు ఖరారు చేసేందుకు రాష్ట్ర మంత్రులతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఉత్సవాల నిర్వహణపై తుది కార్యాచరణనను రూపొందించనున్నారు.
ఇక దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. వేడుకల నిర్వహణపై మంత్రులు అధికారులతో సమాలోచనలు జరిపారు.
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఊరూరా పండగలా.. ఘనంగా నిర్వహించాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సచివాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. కనీవినీ ఎరగని రీతిలో వేడుకలు నిర్వహించాలన్న మంత్రి ఎర్రబెల్లి.. గ్రామాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని 23 రోజుల పాటు ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.