వచ్చేస్తున్నాయి.. త్వరగానే వచ్చేస్తున్నాయి.. ఇక ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్టే. ఎందుకంటే.. నైరుతి రుతు పవనాలు బయలుదేరాయి. శుక్రవారం ఇవి ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ నాలుగో తేదీ నాటికి కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. రాష్ట్రంవైపు వాయవ్య దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనుండగా ద్రోణి ప్రభావంతో శని, ఆదివారాల్లో దక్షిణ, తూర్పు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలతో నల్గొండ జిల్లా అల్లాడుతోంది. శుక్రవారం సైతం ఈ జిల్లాలోని దామరచర్లలో 45.4, నేరేడుగొమ్ములో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.4, నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి.