తెలంగాణలో ఉన్న అనాథ పిల్లలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో అనాథ పిల్లల పూర్తి సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పీఎం కేర్స్ కన్నా మెరుగైన విధానం రూపొందించడంతో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంపై అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారితో తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలతో పాటు ఇతర అనాథ బాలల సంక్షేమానికి ప్రత్యేక విధానం తీసుకురావాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. అనాథల సంరక్షణపై ప్రస్తుతం ఉన్న వేర్వేరు ఉత్తర్వులను ఒకే విధానం కిందకు తీసుకువచ్చేందుకు, వారి సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఉపసంఘాన్ని నియమించింది. అనాథ బాలలకు 21 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఈ మేరకు విధానంలో చేర్చాలని ఉప సంఘం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సిఫార్సులు చేసింది.