తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ఠ్. తెలంగాణ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలో విత్తనాలు విత్తుకోవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. వరి నార్లు పోసేవారు స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలన్నారు.
పత్తి విత్తనాలను జూలై 20 వరకు, కంది ఆగస్టు 15, సోయాచిక్కుడు జూన్ నెలఖరు వరకు, మొక్క జొన్న, పెసర, మినుము జూలై 15 వరకు విత్తుకోవచ్చని…ఆముదాలు, సన్ ఫ్లవర్, ఉలవలు జులై 31 వరకు సాగు చేసుకోవచ్చని తెలిపారు. కాగా, అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది.
తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించే సంకేతాలు అందించాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.