బీజేపీకి ప్రజా సంక్షేమమే ముఖ్యమని.. పదవులు కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీజేపీ తెలంగాణ ప్రజల టీమ్ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు అందరూ కలిసి పనిచేయాలని కమలం శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ దోపిడీ, హత్యల పాలనను ప్రజలు చూశారని.. ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బీఆర్ఎస్ పాలననూ చూశారని.. అందుకే సంక్షేమానికి పెద్దపీట వేసి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
“కర్ణాటకను 5 నెలల్లో బ్రష్టు పట్టించారు. గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ కు అమలు చేసే సత్తా లేదు. ఆర్టికల్ 370 తొలగించిన చరిత్ర మోదీ ప్రభుత్వానిది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చింది మోదీ ప్రభుత్వం. పాక్ ఐఎస్‌ఐ ద్వారా లక్షల కోట్లు భారత్‌లో చలామణి అయ్యేది.. అక్రమ చలామణి కట్టడికి పెద్దనోట్లు రద్దు చేసిన చరిత్ర బీజేపీది. బీజేపీ కార్యకర్తలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేద్దాం. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేద్దాం.” అని కాషాయ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.