జులై 4వ తేదీన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి పై కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. ఆయన రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరగడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు తాను మంత్రినేనని అన్నారు. ఎవరైనా పార్టీ పాలసీని ఫాలో కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకరికి ఒక పదవి మాత్రమేనని పేర్కొన్నారు కిషన్ రెడ్డి.
తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని.. పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ నెల 8న వరంగల్ లో ప్రధాని మోదీ సమావేశం అనంతరం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానన్నారు. కేంద్ర మంత్రి పదవి పై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని.. పార్టీ నిర్ణయమే తన నిర్ణయం అని చెప్పుకొచ్చారు.