ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అర్థిక వనరుల సమీకరణ పేరిట గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఇలా ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
“వేలం వేయాలని నిర్ణయించిన ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవ వైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయి. 734 వృక్షజాలు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి. ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని భావిస్తున్నాను. సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని ఆశిస్తున్నాను.” అని కేంద్ర మంత్రి కోరారు.