అయోధ్య ఆలయం దేశ సంస్కృతికి చిహ్నం అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బానిస మనస్తత్వం నుంచి బయటపడేసే దేవాలయం అయోధ్య అని తెలిపారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. సంక్రాంతి నుంచి అన్ని ఆలయాల్లో స్వచ్ఛత అభియాన్ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. శ్రమదానం ద్వారా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ లైవ్ ఇస్తామన్న కిషన్ రెడ్డి.. అయోధ్య కార్యక్రమం తిలకించేలా జనవరి 22వ తేదీన అన్ని ఆలయాల వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత అన్ని ఆలయాల్లో దీపారాధన, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఈనెల 22వ తేదీన సాయంత్రం ప్రతి హిందువు ఇంటి ముందు పచ్చ తోరణాలు, ముగ్గులతో అలంకరణ చేయాలని సూచించారు. ఐదు రామజ్యోతులు వెలిగించుకునేలా కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ ప్రజలంతా ఆ రోజున రామజ్యోతి వెలిగించాలని కిషన్ రెడ్డి కోరారు.