రేపటి నుంచి యథావిథిగా అద్దె బస్సులు నడుస్తాయి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

-

తెలంగాణలో రేపటి నుంచి యథావిథిగా అద్దె బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అద్దె బస్సుల సంక్షేమ సంఘం నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి తమ వినతులు వివరించారు. నాలుగేళ్ల నుంచి బస్సులకు సరైన మైలేజ్ రాక నష్టపోతున్నామని, డీజిల్ భారం పెరిగి ప్రస్తుతం ఉన్న కేఎంపీఎల్ కూడా రావడం లేదని వారు వాపోయారు. తమకు పీవీజీ, ఎక్స్ప్రెస్ బస్సులకు రూ.4.50, సిటీ బస్సులకు రూ.4గా మార్పులు చేయాలని కోరారు. ఓవర్ లోడ్ కారణంగా నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని సజ్జనార్తో వారు తమ గోడు వెల్లబోసుకున్నారు.

దాదాపు వారితో గంటపాటు చర్చలు జరిపిన అనంతరం ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. వాళ్లు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటి వేస్తామని తెలిపారు. రేపటి నుంచి యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని.. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఉచిత బస్ సర్వీస్ లు ఉంటాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news