హైదరాబాద్ శంషాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పాలనపై సుదీర్ఘ పోరాటం చేశామన్న ఆయన.. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవలేక ప్రజా ఆగ్రహానికి గురైందని పేర్కొన్నారు.
“సీఎం ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిపై కాషాయ జెండా ఎగిరింది. సీఎం సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరింది. బీజేపీ ఓటు బ్యాంకు 14 నుంచి 35 శాతానికి పెరిగింది. రాష్ట్ర ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఎనిమిది నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.” అని మండిపడ్డారు.