రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఇంకా అమలు చేయట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఇంకా చేయలేదని అన్నారు. గ్యారెంటీలు ఎందుకు అమలు చేయట్లేదని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ ఆయన రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్… రైతులకు ఇచ్చిన గ్యారెంటీల అమలుకు ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మార్పు అన్నారు కానీ కేసీఆర్ కుటుంబం పోయి.. సోనియా కుటుంబం వచ్చింది. కొత్తగా తీసుకున్న అప్పులను డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇంకా రుణమాఫీ ఎందుకు చేయలేదో రైతులకు సమాధానం చెప్పాలి. రేవంత్‌రెడ్డి మాట నమ్మి రైతులు రుణాలు తీసుకున్నారు. పంట కోత సమయంలో రైతుల వద్ద డబ్బులు లేవు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు? ధాన్యం కొనుగోళ్లులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. తెలంగాణలో వసూలు చేసి దిల్లీలో ఇవ్వడానికి సమయం ఉంటుంది.’ అంటూ కిషన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.