పార్టీలకతీతంగా ప్రజలంతా తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. పరేడ్ మైదానంలో జరిగే ప్రారంభ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
ఈ క్రమంలోనే 1948 సెప్టెంబర్ 17న ఆనాటి హోంమంత్రి హైదరాబాద్‌లో కేంద్రప్రభుత్వం తరఫున జెండా ఎగురవేశారని.. 74 సంవత్సరాల తర్వాత నేటి హోంమంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వం తరఫున జెండా ఎగురవేయబోతున్నారని అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా విమోచన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
ఈ వేడుకలకు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు ఆహ్వానాలు పంపినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విమోచన దినాన్ని చేయాలని అడిగితే మజ్లిస్ పార్టీ వద్దంటోందని చెప్పారని ఆరోపించారు. పాత బురుజులకు రంగులు వేసి జెండాలు ఎగురవేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు విమోచన దినోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.