మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతోందని టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం ఆరోపించారు. ముఖ్యంగా మంత్రులే రంగంలోకి దిగి డబ్బు, మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధభవన్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ముందు బైఠాయించి కోదండరాం మౌనదీక్ష చేపట్టారు. అనంతరం సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి మునుగోడులో జరుగుతున్న అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు.
‘‘విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ ఎన్నికల నిబంధనలను పూర్తిగా గాలి కొదిలేశారు. ఎన్నికల నియమాలను తుంగలో తొక్కుతున్నా ఈసీ పట్టించుకోకపోవడం దారుణం. మంత్రులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. మంత్రులకు ఇస్తున్న ఎస్కార్టును రద్దు చేయాలి. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది’’ అని సీఈఓకు ఫిర్యాదు చేశారు.