సరిగ్గా నాలుగురోజుల క్రితం కూకట్ పల్లిలో ఓ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సహస్ర అనే బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులు ఎవ్వరో తెలియక పోలీసులు నాలుగు రోజుల నుంచి తలలు పట్టుకున్నారు. తల్లిదండ్రులతో సహా కుటుంబీకులకు విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో కేసును ఛేదించడం కష్టంగా మారింది. చివరికీ సహస్ర తండ్రి కృష్ణ పై అనుమానం రాగా.. కూతురుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆయనకు చంపాల్సిన పని ఏంటి..? అని కుటుంబ సభ్యులు ఫైర్ అయ్యారు.
తాజాగా ఈ కేసు మిస్టరీ వీడింది. సహస్రను చంపింది పదోతరగతి చదివే ఓ బాలుడు అని తేల్చేశారు పోలీసులు. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం బలపడింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన పదోతరగతి బాలుడు.. సహస్ర గొంతు కోసి పరారైనట్టు తెలుస్తోంది. సహస్ర పై కూర్చొని గొంతు నులిమి, ఆపై బ్రతికి ఉందేమో అనే అనుమానంతో కత్తితో గొంతు కోసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్ర బ్రతికి ఉండకూడదనే విచ్ఛలవిడిగా కత్తితో పొడిచినట్టు సమాచారం.
దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందే.. ఎవరైనా అడ్డొస్తే.. ఏం చేయాలనే అనేది ముందే ఓ పేపర్ పై రాసుకొని దానినే అమలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో నుంచి రూ.80వేలు తీసుకొని పరారవుతుండగా సహస్ర అడ్డుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడించారు పోలీసులు.