టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. రెండో దశలో ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ స్టేషన్ల కోసం నిధులు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కోరింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని 9 చోట్ల సైడ్ లుకింగ్ కలర్ డాప్లర్ ప్రొఫైలర్స్తో కూడిన టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని బోర్డు 9, 12వ సమావేశాల్లో నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటికి రూ.6.25 కోట్లు అవసరమవుతాయని .. నిధులు ఇవ్వకపోవడంతో 2023-24లో వీటిని ఏర్పాటు చేయలేకపోయినట్లు కేఆర్ఎంబీ తెలిపింది.
రెండు రాష్ట్రాల నీటి వినియోగంలో పారదర్శకత, వాటాలు సరిగ్గా పొందాలంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అత్యవసరమని బోర్డు పేర్కొంది. ఈ అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని రెండు రాష్ట్రాలను కోరింది. అటు నాగార్జున సాగర్ డ్యాంపై మరమ్మతుల పనులు చేసేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు కేఆర్ఎంబీ అనుమతి ఇచ్చింది. రేడియల్ క్రస్ట్ గేట్లకు సంబంధించిన విద్యుత్ కంట్రోల్ ప్యానెళ్లు, కేబుల్స్ పనులను వర్షాకాలంలోపు పూర్తి చేయాల్సి ఉందని.. ఆ మరమ్మత్తుల పనుల పూర్తి కోసం తెలంగాణ అధికారులను అనుమతించాలని అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న సీఆర్పీఎఫ్ అధికారులను బోర్డు ఆదేశించింది.