తెలంగాణ శాసనసభ ఎన్నికల రాజకీయం రోజురోజుకు రాజుకుంటోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తమకు మరో అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రజలను కోరుకుంటోంది. మరోవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ తమ ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తోంది. ఇంకోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ జోడెద్దులంటూ.. ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి న్యాయం చేయలేవంటూ తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరుతోంది బీజేపీ.
అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీలిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడమే కాకుండా పలు పార్టీలు ఓటు హక్కు ప్రాధాన్యతను ఓటర్లకు వివరిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తాను పాల్గొంటున్న ప్రతి ప్రజా ఆశీర్వాద సభలో ఓటు హక్కు వినియోగించుకోవడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల చేతిలో ఉన్న అత్యంత బలమైన ఆయుధం ఓటు అని.. ఐదేళ్ల తమ భవిష్యత్ తమ చేతిలోనే ఉందంటూ ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఇక తాజాగా రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. పోలింగ్ రోజు సెలవు దినంగా భావించి సినిమాలు చూస్తూ ఇళ్లకు పరిమితం కావొద్దని.. బయటకొచ్చి తప్పకుండా ఓటు వేయాలని కోరారు.