BRS ఎంపీలు గెలవకపోతే పార్లమెంట్లో తెలంగాణ పేరు వినబడదు : కేటీఆర్

-

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ గళం, బలం, దళం పార్లమెంటులో చూడాలంటే తమ పార్టీని గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తమ పార్టీకి ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలంగాణ అని పునరుద్ఘాటించారు. రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్‌, బీజేపీల వల్ల కాదని వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్‌ ఎంపీలనే ఎందుకు గెలిపించాలో ప్రజలకు చెప్తామని కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. దేశంలో ఒక్కో రాష్ట్రం పేరు చెప్తే ఒక్కో నేత గుర్తు వస్తారని, అలా జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కేసీఆర్‌ పేరు మాత్రమేనని తెలిపారు.

బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్‌ దాడులకు దిగుతోందని విమర్శించిన కేటీఆర్.. కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని ఆరోపించారు. హస్తం పార్టీ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కేటీఆర్ అన్నారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయలేకపోతే ఆ పార్టీని బొంద పెట్టడం ఖాయమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news