ఎమ్మెల్యేలను కొనడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. రేపటి నుంచి రైతు వేదికలో ‘కాంగ్రెస్ పార్టీ కటిక చీటక్ల పాలన వద్దు’ అని తీర్మానం చేస్తామని తెలిపారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని.. అందుకే ఏనాడూ మోదీని ప్రశ్నించలేదని చెప్పారు. గాంధీభవన్‌లో గాడ్సే రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదని, ప్రతి పాఠశాలని కేసీఆర్ ప్రభుత్వమే బాగు చేస్తుందని కేటీఆర్ అన్నారు.
ఐదు దశాబ్దాల పాటు దేశ ప్రజలను కాంగ్రెస్ రాచి రంపాన పెట్టిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మాటలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. రైతులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంటు, విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పుల్ని లైన్‌లో పెట్టి నిల్చున్నది నిజం కాదా?అని ప్రశ్నించారు.