జైల్లో ఉంటూ తనపై ఆరోపణలు చేసిన సుఖేష్ చంద్రశేఖర్‌కు శుక్రవారం రోజున బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపారు. దిల్లీలో జైలులో ఉన్న సుఖేష్ తన న్యాయవాది ద్వారా కేంద్ర హోంమంత్రికి, సీబీఐకి, గవర్నర్‌కు ఫిర్యాదు పంపుతూ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్… తనపై తప్పుడు వివరాలతో ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.
ఉద్దేశపూర్వకంగా, నిరాధార ఆరోపణలు చేసిన సుకేష్ చంద్రశేఖర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పి ఫిర్యాదును వెనక్కుతీసుకోకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తప్పుడు, కల్పిత అంశాలతో ఆరోపణలు చేశారని, అన్నీ అవాస్తవాలనీ, భవిష్యత్తులో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని లీగల్ నోటీసులో మంత్రి పేర్కొన్నారు. వివిధ రకాల క్రిమినల్ కేసుల్లో జైల్లో ఉన్న వ్యక్తి సమాజంలో గౌరవ మర్యాదలున్న తనపై దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.