తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ముఖ్యంగా పార్టీ ముఖ్యనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటుండగా.. మంత్రి హరీశ్ రావు ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా నాలుగు నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.
ఆలేరు, మిర్యాలగూడ, ఉప్పల్, ఎల్బీనగర్‌లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ రోడ్ షోలు రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ చేతిలో అధికారం పెడితే.. రాష్ట్రం ఆగమైపోవడం ఖాయమని చెబుతున్నారు.