మాకు రాముడైనా.. కృష్ణుడైనా ఎన్టీఆరే : మంత్రి కేటీఆర్

-

రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా నందమూరి తారకరామారావే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.. భారత దేశంలో తెలుగు వారంటూ గుర్తించేలా చేసింది ఆయనేనని తెలిపారు. చరిత్రలో ఆయన స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు అని కేటీఆర్ అన్నారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడని కొనియాడారు. అంతటి గొప్ప మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని తెలిపారు. తనకు కూడా తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని.. తారక రామారావు పేరులోనే పవర్‌ ఉందని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version