తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఓ వైపు బీఆర్ఎస్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉండగా.. కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలో తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ విచ్చేస్తున్న విషయం విధితమే.
తాజాగా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది.. మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి.. అందుకే బీజేపీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పథకాలన్నీ పూర్తిగా వైఫల్యం చెందాయని.. విద్య, వైద్యం పూర్తిగా కుంటు పడింది అన్నారు. ఆర్థిక వ్యవస్థ విఫలం అయ్యింది. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ తెలివి ఎక్కడ బోయింది అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్టే.. ఎలాగో గెలవరు కాబట్టి ఇష్టమొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇస్తుంది. ఆరు గ్యారెంటీలు కాదు.. 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాదని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.