శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ బరిలో దింపింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తై ప్రచారపర్వం కొనసాగుతున్న తరుణంలో నియోజకవర్గ పరిధిలోని నేతలతో కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు.
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించి నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. 2007లో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్కు సవాల్‌తో కూడుకొంది. దీంతో ఉపఎన్నికకు సంబంధించిన అన్ని అంశాలపై కేటీఆర్ నేతలతో చర్చించనున్నారు.