కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్ 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అభాగ్యనగరంగా మారిందని అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయని.. అమ్మకాలు జరగకపోవడంతో రియల్టర్లు ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. అన్నదాతలే కాదు వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘ పోస్టు పెట్టారు.
“కూల్చడం కాదు కట్టడం నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోవాలి. హైదరాబాద్లో గత త్రైమాసికంలో 49 శాతం ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్ లీజింగ్ కూడా అధః పాతాళానికి వెళ్లింది. 2025 జనవరి – మార్చి మధ్య 41 శాతం తగ్గింది. కాంగ్రెస్ సర్కార్ దూరదృష్టి లేని, అసమర్థ విధానాలే ఈ పతనానికి కారణం. కూల్చడం కాదు … కట్టడం నేర్చుకోండి. అబద్దాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోండి. జాగో తెలంగాణ జాగో!” అంటూ కేటీఆర్ ఎక్స్ లో రాసిన పోస్టులో పేర్కొన్నారు.