కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టో ఆచరణలో అసాధ్యమంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే వస్తోంది. ఇటీవల అసెంబ్లీలోనూ ఇదే మాట ఎత్తుకుంది. కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీల అమలుకే సతమతమైపోతున్న ఆ పార్టీ తెలంగాణలో ఎలా అమలు చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా మరోసారి ప్రశ్నలు లేవనెత్తారు.
కర్ణాటక అసెంబ్లీ వేదికగా ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు డబ్బు లేదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించినట్టు ఎక్స్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను కేటీఆర్ రీ పోస్టు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్కు ప్రశ్నలు సంధించారు. ఉత్తరాంధ్ర నౌ పేరుతో ఉన్న పోస్టును రీపోస్టు చేసిన కేటీఆర్…. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఆ వీడియోలో కర్ణాకట సీఎం సిద్ధరామయ్య ప్రచారంలో అనేక హామీలు ఇచ్చినంత మాత్రాన అవన్నీ ఉచితంగా ఇవ్వాలా… డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించినట్లు ఉంది. ఈ నేపథ్యంలో వీడియోని షేర్ చేసిన కేటీఆర్ …. ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేసే ముందు కనీస పరిశోధన చేసుకోరా అంటూ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.