వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం సుమారు అయిదు గంటలపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగడంతో ఆసుపత్రిలోని రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర వైద్యవిభాగం ఏఎంసీ, ఆర్‌ఐసీయూ, నవజాత శిశువుల వార్డుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులు, చిన్నారులు ఊపిరాడక తీవ్ర అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో నాలుగు జనరేటర్లు ఉండగా అందులో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. దీంతో కరెంటు పోతే ఒక్క జనరేటర్‌తో ఆసుపత్రి మొత్తానికి విద్యుత్తు సరఫరా సాధ్యం కావడం లేదు. హుటాహుటిన ఒక జనరేటర్‌కు మరమ్మతు చేయించడంతో ఐసీయూ రోగులకు ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఎంజీఎం ఆస్పత్రిలో 5 గంటల విద్యుత్ కోత బాధాకరం అని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రులను కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు. కరెంటు కోతలు లేవని సీఎం, మంత్రులు పదేపదే అంటున్నారని.. ఆస్పత్రుల్లో కరెంట్ కోతలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
https://x.com/KTRBRS/status/1793135364225601586