గత వారం రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ఎడతెరిపి లేకుండా కుండపోతం వర్షం పడుతోంది. ముఖ్యంగా బుధవారం ఉదయం నుంచి ఇవాళ సాయంత్రం వరకు ఏకధాటి వర్షం పడుతోంది. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. నగరంలోని నాలాలు, చెరువులు ఉప్పొంగి పొర్లుతున్నాయి.
ఇవాళ మూసారాంబాగ్ బ్రిడ్జిని దాటి వరద ప్రవహిస్తోంది. ఈ క్రమంలో బ్రిడ్జి వద్ద వరద పరిస్థితి, మూసీపై లో లెవెల్ వంతెనను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఇవాళ అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో.. నగరవాసులకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సాయం అందించాలని సూచించారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు వర్షాల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకునే బాధ్యత తమదని స్పష్టం చేశారు.