బీఆర్ఎస్ గెలిస్తే పర్యాటక శాఖ అడుగుతా: మంత్రి కేటీఆర్‌

-

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రిగా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఐటీ శాక ద్వారా ఎన్నో అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. మరోవైపు పురపాలక శాఖ ద్వారా పట్టణాల అభివృద్ధికి తోడ్పడ్డారు. ముఖ్యంగా భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే మరోసారి తాను గెలిచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం.. తనకు పర్యాటక శాఖ ఇవ్వమని సీఎం కేసీఆర్​ను కోరతానని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయన్న కేటీఆర్.. తనకు ఓ అవకాశం ఇస్తే హైదరాబాద్‌ పరిసరాల్లో వారాంతపు విహార కేంద్రాలను అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే గండిపేట, హిమాయత్‌సాగర్‌ల వద్ద కూడా పర్యావరణానికి హాని జరగకుండా పర్యాటకులకు వసతులను పెంపొందిస్తానని తెలిపారు.

హైదరాబాద్‌ ఎంతలా అభివృద్ధి చెందిందో ఇప్పటికే తలైవా రజనీకాంత్‌, బాలీవుడ్‌ నటుడు సన్నీ దియోల్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఫాక్స్‌కాన్‌ అధినేత యాంగ్‌ లీ హైదరాబాద్‌ను చూసి ఇది ఇండియాలా లేదని అన్నారంటే.. హైదరాబాద్ సాధించిన ప్రగతికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news