హైదరాబాద్ వనస్థలిపురంలోని కమ్మగూడలో భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూ వివాదంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్లాట్ ఓనర్లు పలు బైకులకు నిప్పు పెట్టారు. కమ్మగూడలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో వివాదం చోటుచేసుకుంది. తామ గత 20 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్స్, ఇల్లు నిర్మించుకుని ఉంటున్న ప్రాంతం మాదంటూ భూ కబ్జాదారులు కొన్ని రోజులుగా తమను భయపెడుతున్నారని ప్లాట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ ఉదయం మెహదీపట్నం నుంచి మహిళలను బస్సుల్లో తీసుకువచ్చి తమపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ క్రమంలో కబ్జాదారులను తరిమికొట్టి.. వారి వాహనాలకు నిప్పుపెట్టారు. మహిళలు వచ్చిన బస్సు అద్దాలను ప్లాట్ల యజమానులు ధ్వంసం చేశారు.