తెలంగాణలో బీసీలకు లక్ష రూపాయల రుణం దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. దీంతో ఆశావాహులు ఎమ్మార్వో కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఒక్కసారి రద్దీ పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఒక్కో అప్లికేషన్‌కు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతున్నట్లు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే లక్ష ఆర్థిక సాయం పథకానికి దరఖాస్తుల సంఖ్య మూడు లక్షలు దాటిందని అధికారులు చెబుతున్నారు. ధ్రువ పత్రాలను వెంటనే జారీ చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉప సంఘం సూచించినా ఫలితం లేదని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 ఏప్రిల్ ఒకటి నుంచి జారీ చేసిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ఉప సంఘం సూచించింది. మరోవైపు.. మీసేవ, ఆన్‌లైన్ కేంద్రాలు కుల వృత్తుల కుటుంబాల నుంచి దరఖాస్తు ఫీజు పేరిట భారీగా వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తు గడువు పొడిగించాలంటూ బీసీ కులవృత్తుల కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.