తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఎంతో ముఖ్యమైన రోజు అని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో భాగంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ బృహత్తరమైన కార్యక్రమం అన్నారు.
డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రకటన సోనియా గాంధీ చేశారని.. సమస్త తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన రోజు డిసెంబర్ 9వ తేదీ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పై ప్రతిపక్ష నాయకుడు తన అనుభవం చెప్తారని ఆశించామని.. కానీ అసెంబ్లీకి రావద్దు, తెలంగాణ తల్లి విగ్రహరూప కల్పనలో పాల్గొనవద్దని అసెంబ్లీ రూల్స్ కి విరుద్ధంగా బిఆర్ఎస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. భేషజాలను, రాజకీయాలను పక్కన పెట్టాలని ప్రతిపక్ష నేతలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఇది చాలా ప్రత్యేకమైన అంశం అని, ఈ ఒక్కరోజు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ పాల్గొనాలని కోరారు.