తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. తెలంగాణలో మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరోవైపు నామపత్రాల పరిశీలన తర్వాత రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 893 మంది 1,488 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపింది. వాటిలో 268 మందికి చెందిన 428 సెట్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరోవైపు పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భద్రతా బలగాలు రాష్ట్రంలోకి దిగినట్లు వెల్లడించారు. వేసవి అయినందున ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.